
ఆటిజం అంటే ఏమిటి?
ఆటిజం అనేది మెదడు అభివృద్ధిలో వచ్చే తేడాల వల్ల కలిగే స్థితి. ఇది సాధారణంగా బాల్యంలోనే కనిపిస్తుంది. దీనిని మందబుద్ధి అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత మొదటి మూడేళ్ళలో దీని లక్షణాలు తెలుస్తాయి. ఆటిజం ఉన్నవాళ్ళు.. సామాజిక విషయాలను అర్థం చేసుకోవడంలో, ఇతరులతో మాట్లాడటంలో మరియు వారి ప్రవర్తనలోను కాస్త విభిన్నంగా ఉండవచ్చు. ఈ ఆటిజం అనేది వ్యాధి కాదు, ఒక వ్యక్తిలో కనిపించే వైవిధ్యం మాత్రమే. ఆటిజం ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానంలోనైనా.. జీవితాన్ని ఆస్వాదించడంలో, అనుభూతి చెందడంలోనైనా వైవిధ్యం కనిపిస్తుంది.
ఇక ప్రతి ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఆటిజం ఆవగాహన దినోత్సవం’ని జరుపుతుంటారు. ఆ రోజున ఆటిజంతో బాధపడే వారికి మద్దతు కల్పిస్తూ, సమాజంలో వారికి సరైన గౌరవ మర్యాదలు, ఉపాధి అవకాశాలు అందించాలని, వారి పట్ల బాధ్యతగా మెలగాలని గుర్తు చేస్తూ.. ఆటిజం డే నిర్వహిస్తారు. మరి ఆటిజం అంటే ఏంటి? దాని పూర్తి వివరాలు ఏంటనే వివరాల్లోకి వెళ్దాం..
ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయి?
ఆటిజం లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి. కానీ, మనం సాధారణంగా చూసినట్లయితే..
- చూడటం, పలకరించడంలో ఇబ్బంది పడటం
- ఇతరులతో ఐ కాంటాక్ట్ (కళ్ళలోకి చూడటం)
- చిరునవ్వు, కోపం లాంటి సంకేతాలు అర్థం చేసుకోలేకపోవడం
- ఫ్రెండ్ షిప్ చేయడంలో ఇబ్బందులు
- కమ్యూనికేషన్ సమస్యలు
- మాట్లాడటానికి ఇబ్బంది పడటం లేదా అసలు మాటలు రాకపోవడం
- పదేపదే చెప్పిన పదాలను లేదా వాక్యాలను చెప్పడం (ఎకోలాలియా)
- ఒక వ్యక్తితో సంభాషణ మొదలుపెట్టడంలో లేదా కొనసాగించడంలో ఇబ్బంది పడటం
- ప్రవర్తనలో మార్పులు మరియు పరిమిత ఆసక్తులు
- తరచూ చేతులు ఆడించడం, శరీరాన్ని వణుకుతున్నట్లు ఊపడం వంటివి రిపీట్ చేయడం
- ఒకే విషయంపై మితిమీరిన ఆసక్తి చూపించడం (ఉదాహరణకు ఏదైనా వస్తువు, సబ్జెక్టు లేదా మరేదైనా కావచ్చు)
- మార్పులను స్వీకరించలేకపోవడం, వాళ్ళు అనుకున్నదే కావాలని పట్టుబట్టడం..
- సెన్సరీ సమస్యలు
- ఏదైనా సౌండ్ విన్నా, వెలుతురు పడినా లేదా ఎవరైనా తాకినా రియాక్షన్ భిన్నంగా ఉండటం (అయితే ఓవర్ గా రియాక్ట్ అవుతారు లేదా తక్కువగా రియాక్ట్ అవుతుంటారు)
ఆటిజం రావడానికి గల కారణాలు:
ఆటిజం రావడానికి ఖచ్చితమైన కారణాలేవి తెలియలేదు. కానీ.. జన్యుపరంగా మరియు పర్యావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
- జన్యు పరమైన కారణం: కుటుంబంలో ఎవరికైనా ఆటిజం ఉంటే.. మరో వ్యక్తికి వచ్చే అవకాశం ఎక్కువ
- మెదడు అభివృద్ధిలో మార్పులు: తల్లి గర్భంలో ఉన్నప్పుడు మెదడు అసాధారణంగా అభివృద్ధి చెందడం కావచ్చు
- పర్యావరణ కారకాలు: గర్భధారణ సమయంలో తల్లికి ఇన్ఫెక్షన్లు, కొన్ని రసాయనాలకు గురికావడం వంటివి ఆటిజం అవకాశాన్ని పెంచవచ్చు
- అపోహలు: టీకాలు ఆటిజానికి కారణమవుతాయనే అపోహ శాస్త్రీయంగా తప్పని నిరూపించబడింది
ఆటిజం రోగనిర్ధారణ:
ఆటిజం అనేది.. సాధారణంగా బాల్యంలోనే (2-3 సంవత్సరాల వయస్సులో) గుర్తించబడుతుంది. వ్యక్తి యొక్క ప్రవర్తన, ఎదుగుదల, మరియు వైద్య పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేస్తారు.
- ప్రవర్తనా పరిశీలన: పిల్లల ప్రవర్తన బట్టి వైద్య నిపుణులు నిర్ధారిస్తారు.
- ఎదుగుదలను గమనించడం: మాట్లాడే మాట, చేసే చర్యలతో పాటు సామాజిక నైపుణ్యాలలో చురుకుదనం లేదా ఆలస్యాన్ని గమనిస్తారు.
- వైద్య పరీక్షలు: జన్యు పరీక్షలు లేదా ఇతర సమస్యలను పరీక్షలు నిర్వహించి నిర్ధారించే అవకాశం ఉంది.
*బాల్యంలోనే ఆటిజం యొక్క లక్షణాలను గమనించి, రోగ నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వయసులో వారికి తగిన సహాయం అందిస్తే పిల్లల యొక్క జీవన నాణ్యత మెరుగవుతుంది.
ఆటిజం చికిత్స మరియు నివారణ మార్గాలు:
ఆటిజం అనేది.. సాధారణంగా నయం చేయబడే వ్యాధి కాదు. కానీ సరైన సమయంలో చికిత్స మరియు తగిన సహకారం అందిస్తే ఆ లక్షణాలను నివారించవచ్చు.
ఆటిజం నివారణకు సంబంధించి కొన్ని చికిత్స పద్ధతులు:
- బిహేవియరల్ థెరపీ: అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ (ABA) వ్యక్తి యొక్క సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
- స్పీచ్ థెరపీ: దీని ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి.
- ఆక్యుపేషనల్ థెరపీ: రోజువారీ జీవన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
- మందులు: ఆందోళన, హైపర్ యాక్టివిటీ వంటి లక్షణాలను నియంత్రించడానికి మందులు అవసరం అవుతాయి.
- తల్లిదండ్రుల శిక్షణ: పిల్లల అవసరాలను అర్థం చేసుకొని, తగిన సహాయం అందించడం వల్ల మానసిక స్థితి అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
సమాజంలో ఆటిజంపై అవగాహన:
ఆటిజం ఉన్న వ్యక్తులు తరచూ సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారిని అర్థం చేసుకోవడం, గౌరవించడం మన బాధ్యత. విద్యా సంస్థలు, ఉద్యోగ సంస్థలు వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎప్పటికప్పుడు ఆటిజం గురించి అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు మనం చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో ఆటిజం యొక్క పరిస్థితి ఎలా ఉంది?
- ఆటిజం అంచనా లెక్కలు:
పలు నివేదికల ప్రకారం, ఇండియాలో సుమారు 18 మిలియన్ల (1.8 కోట్ల) మంది ఆటిజంతో బాధ పడుతున్నట్లు సమాచారం (ETHealthWorld, 2023 నివేదిక ఆధారంగా). ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే. - ప్రాబల్యం (Prevalence) ఎలా ఉంది:
-
- INCLEN Trust International, 2018 అధ్యయనం ప్రకారం, ఇండియాలో 100 మంది పిల్లలలో 1 ఒకరికి (1%) ఆటిజం ఉన్నట్లు తెలుస్తోంది.
- చండీగఢ్, 2021 అధ్యయనం ప్రకారం, 1.5 నుండి 10 ఏళ్ళ వయస్సు గల పిల్లలలో ప్రాబల్యం 1000 లో 2.25 (0.225%) గా ఉందని సమాచారం.
- ఇక సిస్టమాటిక్ రివ్యూ (Neurology India, 2019) ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో 0.11% మరియు పట్టణ ప్రాంతాల్లో 0.09% ఆటిజం ప్రాబల్యం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆటిజం అనేది ఒక వైవిధ్యత. రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్లను తెచ్చినప్పటికీ, ఆటిజం ఉన్న వ్యక్తులు కూడా అద్భుతమైన నైపుణ్యాలు, ఆసక్తులతో ఎన్నో సాధించగలుగుతారు. ఆటిజం ఉన్నవారికి సరైన సహాయం, ప్రేమ ఆప్యాయతలు, సమాన గౌరవం లభిస్తే వారు కూడా సంతోషకరమైన జీవనాన్ని సాగించగలరు. నేటి నుండే ఆటిజం గురించి అవగాహన కల్పిద్దాం! మెరుగైన సమాజ అభివృద్ధిలో భాగమవుదాం!
*మీ జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలిగినా వెంటనే 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.