
ఉగాది షడ్రుచులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి?
తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. దానికి పూర్వకాలం నుండే ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. ఉగాది అనేది.. సరికొత్త తెలుగు సంవత్సరాదికి ఆరంభం మాత్రమే కాదు, మానవ జీవన విధానంలో సమతుల్యత(బ్యాలెన్సింగ్)ని గుర్తుచేసే ఒక ప్రత్యేకమైన రోజు. ఉగాది పండుగ అనగానే.. ముందుగా అందరికి ఉగాది పచ్చడి గుర్తుకు వస్తుంది. ఆరు రకాల రుచుల కలయికతో(షడ్రుచులు) జీవితంలోని వివిధ కోణాలను, అనుభవాలను సూచిస్తుంది ఉగాది పచ్చడి. అయితే.. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి కమ్మని రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మరి ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది? దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం!
ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఏవి?
ఉగాది పచ్చడిని – వేపపువ్వు (చేదు), బెల్లం (తీపి), చింతపండు (పులుపు), ఉప్పు (ఉప్పు), మిరప (కారం), మామిడి కాయ (వగరు) అని ఈ ఆరు రుచులతో తయారు చేస్తారు.
మరి ఈ షడ్రుచులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి?
తీపి (బెల్లం): తీపి అనేది శరీరానికి శక్తిని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఉండే ఇనుము, కాల్షియం రక్తహీనతను నివారిస్తాయి. అలాగే శరీరంలో వేడిని తగ్గించి, కఫ దోషాన్ని బ్యాలన్స్ చేస్తుంది. తీపిని మితంగా తీసుకుంటే మేలు చేస్తుంది.. అధికంగా తీసుకుంటే మధుమేహం ప్రమాదం పెరగవచ్చు.
పులుపు (చింతపండు): ఆకలిని పెంచడమే కాకుండా శరీరంలో జీర్ణ రసాలను ఉత్తేజపరుస్తుంది. చింతపండులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. కానీ, ఎక్కువ పులుపు తీసుకుంటే గుండెల్లో మంటను కలిగించవచ్చు.
ఉప్పు (ఉప్పు): ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడమే గాక, నీటి శాతాన్ని బ్యాలన్స్ చేస్తుంది. ఇది పిత్త దోషాన్ని నివారిస్తుంది. కానీ, అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది కాబట్టి తక్కువగా మితంగా తీసుకుంటే మంచిది.
కారం (మిరప): కారం అనేది జీవక్రియను (మెటబాలిజం) వేగవంతం చేయడమే గాక చెమట ద్వారా వేడిని తగ్గిస్తుంది. మిరప కాయల్లోని క్యాప్సైసిన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కానీ, తీసుకునే ఆహారంలో ఎక్కువ కారం అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను తెస్తుందని గుర్తుంచుకోవాలి.
చేదు (వేపపువ్వు): వేప చేదు శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది ఎలాగంటే.. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. ఇది పిత్త దోషాన్ని నివారించడమే గాక, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ చేదుని పిల్లలకు దూరంగా ఉంచాలి.
వగరు (మామిడి): మామిడి వగరు జీర్ణక్రియను సులభతరం చేయడమే గాక శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మామిడికాయలో విటమిన్ A, C ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని, కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. అయితే.. ఎక్కువ వగరు తింటే గొంతు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
సాధారణంగా ఈ ఆరు రుచులు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) నియంత్రిస్తాయి. అయితే.. ఈ 6 రుచులలోని ఒక్కో రుచి శరీరంలో ఏయే అవయవాలను ఉత్తేజపరుస్తాయో ఇప్పుడు చూద్దాం!
తీపి – కడుపు, ప్లీహము
పులుపు – గుండె, ఊపిరితిత్తులు
ఉప్పు – కిడ్నీలు
కారం – పెద్దప్రేగు
చేదు – కాలేయం
వగరు – చిన్నప్రేగు
ఈ రుచులను తగిన మోతాదులో తీసుకోవడం శరీర ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఈ ఉగాది షడ్రుచులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఒక సంపూర్ణ ఔషధంగా పనిచేస్తాయి. ఈ విశ్వావసు నామ ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులను ఆస్వాదిస్తూ, వాటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ప్రారంభించడానికి ఉగాది పచ్చడి ఒక అద్భుతమైన మార్గం. ఈ ఉగాది మీకు చక్కని ఆరోగ్యాన్ని అందించాలని కోరుతూ.. మరోసారి మెడ్ యునైటెడ్ వారి తరపున శుభాకాంక్షలు!