
గులియన్ బారే సిండ్రోమ్: లక్షణాలు, రకాలు మరియు నివారణ పద్ధతులు!
గులియన్ బారే సిండ్రోమ్(GBS):-
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వ్యాధులలో గులియన్ బారే సిండ్రోమ్(GBS) ఒకటి. ఇదొక అరుదైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్. మన శరీరంలోని నాడీ వ్యవస్థ(PNS)పై ప్రభావం చూపే ఈ వ్యాధి.. నరాల చుట్టూ ఉండే పొర దెబ్బతినడం వల్ల వ్యాప్తిచెందుతుంది. దీని కారణంగా నరాలు దెబ్బతిని, కండరాలు బలహీనపడటమే గాక ఒక్కోసారి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ వ్యాధికి వయోపరిమితి ఏమి లేదు, కానీ ఎక్కువగా 50 ఏళ్ళు దాటిన వారికి వచ్చే అవకాశం ఉంది.
ఇక వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారిలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, అతిసారం లేదా ఏవైనా టీకాలు, సర్జరీల వల్ల ఈ వ్యాధి సోకవచ్చు. ఇది ప్రాణాంతకమైంది కాకపోయినా, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ వ్యాధి బారినపడి 3-5% మంది వృద్ధాప్యంలో ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెప్తున్నాయి.
గులియన్ బారే సిండ్రోమ్ కి గల కారణాలు:
ఈ వ్యాధి సోకడానికి సరైన కారణాలు లేవు. కానీ, బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన తర్వాత ఈ గులియన్ బారే సిండ్రోమ్(GBS) సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యాధి ప్రభావాన్ని కోవిడ్, ఇన్ఫ్లుయెంజా మరియు డెంగ్యూ లాంటి వైరస్ లు పెంచుతాయి. ముఖ్యంగా కలుషిత ఆహారం, నీటి ద్వారా వేగంగా వ్యాపించే ఈ వ్యాధికి.. కాంపిలోబాక్టర్ జెజుని (కాంపిలోబాక్టర్ జెజున్) బాక్టీరియాని ప్రధాన కారణంగా చెప్తున్నారు.
గులియన్ బారే సిండ్రోమ్ రకాలు:
ఈ గులియన్ బారే సిండ్రోమ్ (GBS)లో చాలా రకాలు ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానంగా చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి.
అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమిలినేటింగ్ పాలీరాడిక్యులో న్యూరోపతి (AIDP):
ఇది సాధారణంగా కనిపించే రకం. నరాల మైలిన్ కోశంపై దాడి చేయడం వల్ల.. అవయవాలతో పాటు ఇంద్రియ వ్యవస్థ బలహీనపడిపోతాయి. ఇది ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలలో కనిపిస్తుంది.
అక్యూట్ మోటార్-సెన్సరీ యాక్సోనల్ న్యూరోపతి (AMSAN):
ఇది గులియన్-బారే సిండ్రోమ్(GBS) లో తీవ్రమైన రకం. బలహీనత, టెండన్ రియాక్షన్స్ కోల్పోవడం, ఇంద్రియాల పనితీరుపై పడిన ప్రభావం దీని లక్షణాలు.
మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ (MFS):
మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ అనేది అరుదైన రకం. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క నరాలపై దాడి చేస్తుంది. మొదట కళ్ళ చుట్టూ నల్లని మచ్చలు(చారలు)గా తయారై ‘ఫెషియల్ పెరాలసిస్’కి దారితీస్తుంది. ఇది ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
అక్యూట్ మోటార్ యాక్సోనల్ న్యూరోపతి (AMAN):
ఇది తీవ్రమైన పక్షవాతం వచ్చి, కంటిచూపు మందగించినప్పుడు తెలుస్తుంది. ఎక్కువగా ఈ రకం మెక్సికో, చైనా, జపాన్ దేశాలలో కనిపిస్తుంది.
గులియన్-బారే సిండ్రోమ్(GBS) నిర్ధారణ పరీక్షలు:
ఎప్పుడైతే నరాల సమస్యలతో వైద్యులను సంప్రదిస్తారో.. అప్పుడు మీ హెల్త్ డేటా అంతా చూసి, కావాల్సిన టెస్టులను తెలియజేస్తారు. వాటిలో ముఖ్యంగా..
నరాల ప్రసరణ అధ్యయన (NCS) & ఎలక్ట్రోమియోగ్రఫీ:
శరీరంలో దెబ్బతిన్న నరాల ఉనికి, తీవ్రతలను గుర్తించి.. కండరాల మధ్య విద్యుత్ చర్యలను అంచనా వేసి బలహీనత లేదా పక్షవాతం ఎలా, ఎందుకు? వచ్చిందని ఈ టెస్ట్ ద్వారా తెలియజేస్తారు.
లంబార్ పంక్చర్ (స్పైనల్ ట్యాప్):
ఇది సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్(CSF) సేకరణ కోసం వీపు దిగువ భాగంలో సూదిని చొప్పించే ప్రక్రియ. ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి సంకేతాల కోసం ఈ టెస్ట్ నిర్వహిస్తారు.
రక్త పరీక్షలు:
ఇమ్యూన్ డిజార్డర్స్ మరియు నరాల బలహీనత లేదా పక్షవాతం వల్ల ఎదురయ్యే సమస్యలను రక్త పరీక్షల ద్వారా తెలుసుకుంటారు.
ఇమేజింగ్ పరీక్షలు:
నరాల బలహీనత లేదా పక్షవాతం వలన ఏర్పడే ట్యూమర్, హెర్నియేటెడ్ స్పైన్ గాయాలను గుర్తించడంలో ఎక్స్-రే, ఎంఆర్ఐ మరియు సిటి స్కాన్ లాంటి ఇమేజింగ్ టెస్టులు నిర్వహిస్తారు.
నరాలు మరియు కండరాల బయాప్సీ:
- నరాలు, కండరాల బలహీనతలకు కారణమయ్యే పరిస్థితులను కనుగొనే ప్రాసెస్ లో ఈ పరీక్ష చేస్తారు.
- ఇవేగాక జీవరసాయన మరియు జన్యు పరీక్ష లాంటివి కూడా నిర్వహిస్తారు.
గులియన్ బారే సిండ్రోమ్ చికిత్స మార్గాలు:
- ఈ వ్యాధిని అరికట్టడంలో స్టెరాయిడ్స్ పాత్ర తక్కువ.
- ఈ చికిత్సలో IV ఇమ్యూనోగ్లోబులిన్(IVIG), ప్లాస్మా ఫెరెసిస్ అనే పద్ధతుల ద్వారా ఇమ్యూనిటీ సిస్టమ్ ని మార్చి, ఆటో ఇమ్యూన్ మరియు నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు.
- ఈ వ్యాధిని అరికట్టడంలో ఫిజియోథెరపీ, ఆక్యూపేషనల్ థెరపీ కీలక పాత్ర వహిస్తాయి.
- ఇలా వివిధ పద్ధతుల ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించడం ద్వారా కొంతమంది 6-12 నెలలలో కోలుకోగలరు. ఇంకొందరు రెండు మూడేళ్ళ వరకు దీని లక్షణాలు కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
గులియన్ బారే సిండ్రోమ్ నివారణ పద్ధతులు:
- ఈ వ్యాధిని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ, అది రావడానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ ని అరికట్టవచ్చు.
- ముందుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి
- స్వచ్ఛమైన మంచినీటిని కాచుకొని చల్లార్చి తాగాలి
- ఎక్కువగా పోషకాహాలు లభించే ఫుడ్ తీసుకోవాలి.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి.
- ధూమపానం, మద్యపానం లేదా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటి వల్ల నరాల బలహీనత ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
- శారీరక శ్రమ అవసరం. వ్యాయామం, యోగా లాంటివి చేయడం వల్ల నరాల సమస్యలు రాకుండా ఉంటాయి.
- ముఖ్యంగా శరీరానికి విటమిన్ డి అందే విధంగా చూసుకోవాలి
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభించే చేపలను ఆహారంగా తీసుకుంటే మంచిది.
ఇక్కడ మనం గమనించవల్సింది ఏంటంటే.. ఈ గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది అంటువ్యాధి మాత్రం కాదు. సమయానికి అవసరమైన చికిత్స తీసుకుంటే దాని ప్రభావం నుండి బయట పడవచ్చు. ఎవరిలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తే మనం కూడా సురక్షితంగా ఉండవచ్చు. కానీ, తెలిసి కూడా ఈ వ్యాధి లక్షణాలను పట్టించుకోకపోతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నుండి బయట పడేందుకు పునరావాసం ముఖ్యమైంది.
మీ హెల్త్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే.. సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం! తక్షణమే మా నిపుణుల సలహా కొరకు 9851 247 365 కి కాల్ చేయండి.