
మలేరియా వ్యాప్తి, నివారణ మరియు జాగ్రత్తలు!
మలేరియా దినోత్సవం.. ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా మలేరియా నియంత్రణ గురించి అవగాహన కల్పించాలనే విషయాన్ని గుర్తు చేస్తుంటుంది. ఈ ఏడాది మలేరియా దినోత్సవాన్ని, ‘మలేరియా మన చేతిలోనే అంతమవుతుంది: రీఇన్వెస్ట్, రీఇమేజిన్, రీఇగ్నైట్’ అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ థీమ్, మలేరియాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సరైన ప్రణాళికను పెట్టుబడిగా పెట్టి, దాన్ని సరైన పద్ధతిలో ఆవిష్కరించి.. సమాజంలో మలేరియా నిర్మూలన గురించి అందరిలో స్ఫూర్తిని నింపాలనే సందేశాన్ని మనకు అందిస్తుంది.
మలేరియా గురించి..
మలేరియా అనేది అనాఫిలిస్ ఆడ దోమలు కాటు ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. ప్లాస్మోడియం పరాన్నజీవి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. 2023లో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 263 మిలియన్ కొత్త మలేరియా కేసులు నమోదయ్యాయి. అలాగే 5,97,000 మరణాలు సంభవించాయి, ఇందులో ఎక్కువ భాగం ఆఫ్రికా ప్రాంతంలోనే నమోదయ్యాయి.
2025లో మలేరియా పోరాటం!
“మలేరియా మన చేతిలోనే అంతమవుతుంది: రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్” అనే థీమ్ మలేరియా నిర్మూలన కోసం కొత్త ఆలోచనలు, ఆర్థిక పెట్టుబడులు, మరియు కృషి గురించి ప్రస్తావిస్తుంది. గత రెండు దశాబ్దాలలో, మలేరియా నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించడం జరిగింది. సుమారు 2.2 బిలియన్ కేసులు మరియు 12.7 మిలియన్ మరణాలు నివారించబడ్డాయి. అయితే, ఇటీవలి కాలంలో పురోగతి స్థిరంగానే ఉంది. వాతావరణ మార్పులు, ఆర్థిక ఒత్తిడులు, సామాజిక సంఘర్షణలు, మరియు కీటకనాశిని నిరోధకత వంటి సవాళ్లు మలేరియా నియంత్రణ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి.
ఈ ఏడాది ముఖ్యంగా 3 ప్రధానాంశాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది:
- రీఇన్వెస్ట్: మలేరియా నియంత్రణ మరియు నిర్మూలన కార్యక్రమాల కోసం ఆర్థిక వనరులను పెంచడం
- రీఇమాజిన్: నూతన టెక్నాలజీ, టీకాలు మరియు ప్రణాళికలతో మలేరియా సమస్యను ఎదుర్కోవడం
- రీఇగ్నైట్: ప్రభుత్వాలు, సంఘాలు, మరియు వ్యక్తుల మధ్య సహకారాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం
మలేరియా నివారణ చర్యలు:
మలేరియా వ్యాధిని నివారించవచ్చు మరియు చికిత్స ద్వారా నయం చేయవచ్చు. ముఖ్యంగా మలేరియా వ్యాప్తిని తగ్గించడంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే..
- రాత్రి వేళల్లో దోమతెరలు (ITNs) ఉపయోగించడం
- ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ (IRS) ద్వారా దోమలను నియంత్రించడం
- మలేరియా టీకాలు, ఉదాహరణకు RTS,S/AS01 (Mosquirix) (ఇవి పిల్లలలో మలేరియా నివారణకు ఉపయోగపడతాయి)
- ప్రమాదం ఎక్కువ అనుకున్న ప్రాంతాలలో సీజనల్ మలేరియా కెమోప్రివెన్షన్ (SMC) లాంటి నివారణ మందులను ఉపయోగించడం.
- పర్యావరణ నిర్వహణ, దోమలు పెరగకుండా నీటి నిల్వలను తొలగించడం.
ఇవేగాక మలేరియా లక్షణాలు (జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు) కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
2025లో మలేరియా దినోత్సవం లక్ష్యాలు..
- ఆరోగ్య సేవలలో సమానత్వం: గర్భిణులు, పిల్లలు, మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మలేరియా సేవలను సమానంగా అందించడం.
- నూతన ఆవిష్కరణలు: కొత్త టీకాలు, ఔషధాలు, మరియు డయాగ్నస్టిక్ సాధనాల అభివృద్ధి
- కమ్యూనిటీ ఇన్వాల్వ్ మెంట్: స్థానికంగా కమ్యూనిటీని భాగస్వామ్యం చేయడం మరియు వారి అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించడం.
ఈ ఏడాది జన్స్ హాప్కిన్స్ మలేరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు బాల్టిమోర్‌లో “బిల్డింగ్ బెటర్ మాస్క్వీటోస్” అనే థీమ్‌తో ఒక సింపోజియం నిర్వహిస్తున్నారు. ఇది మలేరియా నియంత్రణలో జన్యు పరమైన సాంకేతికతలు కీలకపాత్రను సూచిస్తుంది.
మనం చేయాల్సింది ఏంటి?
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మనమంతా ఈ పోరాటంలో భాగం కావాలి.
- అవగాహన పెంచడం: మలేరియా గురించి ప్రజలలో అవగాహన పెంచడం
- నిర్మూలన కార్యక్రమాలలో పాల్గొనడం: దోమతెరల పంపిణీ లేదా అవగాహన కార్యక్రమాలలో పాల్గొనడం
- విరాళాలు ఇవ్వడం: మలేరియా నిర్మూలన కోసం పనిచేసే సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం.
- వ్యక్తిగత జాగ్రత్తలు: దోమల కాటు నుండి రక్షణ పొందడానికి రిపెల్లెంట్లు మరియు దోమతెరలు ఉపయోగించడం.
“మలేరియా మన చేతిలోనే అంతమవుతుంది” అనే సంకల్పంతో మనం కలిసి పనిచేస్తే, ఈ వ్యాధిని నిర్మూలించడం సాధ్యమవుతుంది. ఈ ఏడాది, మలేరియా నియంత్రణ కోసం సరికొత్త ఆలోచనలను స్వీకరిద్దాం, ఆర్థికంగా మద్దతు కల్పిద్దాం మరియు సమాజంలో అవగాహనను పెంచేందుకు కృషి చేద్దాం.
మలేరియా రహిత ప్రపంచాన్ని సృష్టించడం.. మనందరి బాధ్యత!
గమనిక: ఈ బ్లాగ్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మలేరియా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సలహా తీసుకోండి. అలాగే 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.