
యువతలో ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా?
ఈ మధ్యకాలంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఎప్పుడో వయసు పైబడిన తర్వాత రావాల్సిన ఆరోగ్య సమస్యలు.. యుక్త వయసులోనే ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా యువతలో హార్ట్ ఎటాక్(గుండె పోటు) సమస్య ఆందోళన కలిగిస్తోంది. గతంలో వయసు పైబడిన వారిలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు చూసేవాళ్ళం. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుండటంతో.. యువత కంగారు పడిపోతోంది. మరి గుండెపోటు చిన్న వయసులో రావడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్నలపై నిపుణులు ఈ విధంగా స్పందిస్తున్నారు. అలాగే హార్ట్ ఎటాక్స్ రావడానికి కొన్ని అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరి యువతలో ఎక్కువ హార్ట్ ఎటాక్స్ రావడానికి గల అంశాలేంటో చూద్దాం!
ఒత్తిడి:
ఒత్తిడి అనేది మనిషిని మానసికంగా ఎంతలా వేధిస్తుందో చెప్పక్కర్లేదు. ఒత్తిడి మనిషిని మానసికంగా కృంగదీసి, శారీరకంగా ఆరోగ్య సమస్యలతో దెబ్బతీస్తుంది. ముఖ్యంగా యువతలో ఒత్తిడికి కారణాలు(ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్, లవ్, ఫైనాన్సియల్, జాబ్ స్ట్రెస్) ఏవైనా ఇవన్నీ గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర:
సాధారణంగా వయసులను బట్టి ఇన్ని గంటలు నిద్ర తప్పనిసరి అని చెబుతుంటారు. యువత ఐతే కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. కానీ.. ఈ మధ్య యూత్ అంతా మొబైల్ ఫోన్ వాడకంతో రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, తెల్లారి చాలీచాలని నిద్రతో మేల్కోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ నిద్ర టైమింగ్స్ అన్ని మారిపోయి.. గుండె సమస్యలకు దారి తీస్తాయి. సరైన నిద్ర అనేది శరీరాన్ని సెట్ చేస్తుంది.
స్మోకింగ్:
ఈ మధ్యకాలంలో యువతలో ధూమపానం(స్మోకింగ్) అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు ఒత్తిడి(స్ట్రెస్) కారణంగా స్మోక్ చేస్తున్నాం అంటారు.. మరికొందరు ఫ్యాషన్ అంటుంటారు. స్మోక్ అనేది ఏ కారణంతో చేసినా.. ఆరోగ్యానికి పనికొచ్చే విషయమైతే అసలు కాదు. ముఖ్యంగా స్మోకింగ్ గుండె పనితీరుపై చాలా ప్రభావం చూపుతుంది. యువతలో హార్ట్ ఎటాక్స్ ఎక్కువ కావడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
సోమరితనం:
సోమరితనం అనేది ఏ వయసులో వారినైనా ఆరోగ్యం పరంగా డామేజ్ చేస్తుంది. శారీరకంగా యాక్టీవ్ గా లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం వల్ల ఒబెసిటీ(ఊబకాయం), దీర్ఘకాలిక బీపీ సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ క్రమంగా గుండె మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
జంక్ ఫుడ్:
రుచి కోసం చాలామంది ఎక్కువగా జంక్ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తుంటారు. స్ట్రీట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకోవడం ఫ్యాషన్ గా భావిస్తుంటారు యూత్. కానీ.. వాటిలో ఉండే అనవసరమైన ఫ్యాట్స్, సాల్ట్, షుగర్ ఎలిమెంట్స్ అన్ని అత్యధికంగా గుండె పైనే ప్రభావం తీవ్రంగా చూపిస్తాయి. యూత్ లో హార్ట్ ఎటాక్స్ కి ఇదికూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
జన్యుపరమైన కారణాలు:
యువతలో గుండెపోటుకు జన్యుపరమైన అంశాలు కూడా కారణం అవుతాయట. కుటుంబంలో ముందునుండి ఎవరికైనా గుండె సమస్యలు, బీపీ, కొలస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటి ప్రభావం తర్వాత తరాలపై కూడా పడుతుందట.
మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం!
ఒత్తిడి తగ్గించుకోవాలి:
మానసికంగా లేదా శారీరకంగా ఒత్తిడికి గురైతే ఊహించని గుండె పై ప్రభావం పడే అవకాశం ఉంది. రెగ్యులర్ బిజీ లైఫ్ లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి తరచూ చేస్తుండాలి. అలా చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభించి.. వర్క్ లైఫ్ బాలన్స్ అవుతుంది. అలాగే డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే ఒత్తిడితో పాటు యాంగ్జైటీ కూడా తగ్గుతుంది.
స్మోకింగ్:
యుక్తవయసులోనే ధూమపానం(స్మోకింగ్) అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం. స్మోకింగ్, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లను మెడికల్ హెల్ప్ ద్వారా త్వరగా దూరం పెడితే ప్రయోజనాలు ఉంటాయి. అలా చేయడం వల్ల మీ గుండెతో పాటు సమగ్ర ఆరోగ్య రక్షణ లభిస్తుంది.
వ్యాయామం:
గుండె ఆరోగ్యం కొరకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా యూత్ వ్యాయామం పాటిస్తే గనక చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ ప్రమాదం నుండి సేఫ్ గా ఉండవచ్చు. అలాగే ఎరోబిక్స్, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఏదైనా చేయవచ్చు. వారానికి రెండుసార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మరింత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం, ఉత్సాహంగా ఉండటం ద్వారా గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
డైట్:
గుండె ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు ఎంతో సహకరిస్తాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని పూర్తిగా తగ్గించి.. కూరగాయలు, పండ్లు, మల్టీగ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి సహకరించే హెల్తీ ఫ్యాట్స్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో పాటు ఫైబర్, యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ లభించే ఫుడ్స్ తీసుకోవాలి.
ఒబేసిటి:
యువతలో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులలో ఒబేసిటీ(ఊబకాయం) ఒకటి. ఇది డయాబెటిస్ తో పాటు గుండె సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఊబకాయానికి కారణాలు ఏవైనా.. కూర్చునే పని చేసినట్లయితే మధ్యమధ్యలో వాకింగ్ చేయడం.. షుగర్ ఫుడ్స్, ప్రాసెసెడ్ స్నాక్స్, అన్ హెల్తీ ఫ్యాట్స్ ని పూర్తిగా మానేయడం మంచిది. అలాగే పోషకాహారం, నీరు ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీని కంట్రోల్ లో పెట్టవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. సమస్య ఎలాంటిదైనా మెడికల్ సపోర్ట్ తో పాటు రెగ్యులర్ చెకప్స్ ఫాలో అయితే బెటర్ రిజల్ట్స్ చూడవచ్చు.