వడదెబ్బ, డీహైడ్రేషన్ లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ మార్గాలు!
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండల కారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి రోజువారీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలామంది వడదెబ్బ(హీట్ స్ట్రోక్) మరియు డీహైడ్రేషన్ కి గురవుతుంటారు. వీటి ప్రభావానికి ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఎంతటి వేడి వాతావరణంలోనైనా వడదెబ్బ, డీహైడ్రేషన్ లాంటి ఆరోగ్యానికి ముప్పు కలిగించే ప్రభావాల నుండి ఎలా బయటపడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఒకవేళ వడదెబ్బకు గురైతే చికిత్స మార్గాలు ఏమేం ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం!
వడదెబ్బ (Heatstroke) అంటే ఏంటి?
వడదెబ్బ అనేది శరీరంలో అధిక వేడిని తట్టుకునే శక్తిని కోల్పోవడం వల్ల కలుగుతుంది. వడదెబ్బకు సాధారణంగా వాతావరణంలో ఏర్పడే తీవ్ర ఉష్ణోగ్రతలు, నీరు సరిగ్గా తీసుకోకపోవడం లేదా శరీరంపై అధికంగా ఒత్తిడి పడిన సందర్భాలు కారణంగా నిలుస్తాయి. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
- శరీర ఉష్ణోగ్రత 104°F (40°C) పైకి చేరుకుంటుంది
- తలనొప్పి, మైకం రావడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- అకస్మాత్తుగా నీరసం, బలహీనంగా అనిపించడం
2. డీహైడ్రేషన్ (Dehydration)
డీహైడ్రేషన్.. ఇది శరీరానికి సరైన మోతాదులో నీరు, సాల్ట్ అందించకపోవడం వల్ల కలుగుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా చెమట పట్టడం లేదా నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
- తలనొప్పి, అలసట
- మైకం కమ్మినట్లు అనిపించడం
- మూత్రం సరిగ్గా రాకపోవడం
- చర్మం పొడిబారిపోవడం
నివారణ మార్గాలు:
వడదెబ్బ, డీహైడ్రేషన్ ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని చిన్నపాటి నివారణ మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
- నీరు బాగా తాగాలి: వేసవిలో ఎండలకు చెమట ఎక్కువగా పడుతుంది. చెమట వల్ల శరీరంలో నీరు, సాల్ట్ ల కొరత ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజూ క్రమంగా నీరు తాగడం చాలా ముఖ్యం. నీటితో పాటు నేచురల్ ఎలక్ట్రోలైట్స్, నిమ్మరసం లాంటివి తీసుకోవడం మంచిది.
- ఎండలకు దూరంగా ఉండాలి: వేసవి ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపించే ఈ ఎండలకు దూరంగా ఉంటూ.. ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు శరీరానికి చల్లదనాన్ని అందించే ప్రయత్నం చేయండి.
- అధికంగా వేడి అనిపిస్తే.. ఐస్ ప్యాక్స్, చల్లని నీరు మరియు కూల్ గా ఉండే దుస్తులు ధరించడం మేలు.
- వేసవిలో ఆహారం మితంగా తీసుకుంటే మంచిది. ఎక్కువగా వేడిని కలిగించే ఆహారాలకు (చికెన్, ఫాస్ట్ ఫుడ్, ఇతర ఆయిల్ ఫుడ్స్ లాంటివి) దూరంగా ఉండాలి. అవి కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు (నారింజ, పుచ్చకాయ, నిమ్మరసం లాంటివి) తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వడదెబ్బ, డీహైడ్రేషన్ లకు చికిత్స మార్గాలు:
- శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవాలి: వడదెబ్బ తగిలితే.. శరీరానికి చల్లదనాన్ని అందించడం చాలా ముఖ్యం. తడిగుడ్డతో కాపడం, ఐస్ ప్యాక్స్ ఉపయీగించడం వల్ల శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచుకోవచ్చు.
- నీరు అధికంగా తాగాలి: డీహైడ్రేషన్ కి ప్రధాన కారణం శరీరంలో నీటి కొరత. కాబట్టి, అధికంగా తీసుకోవాలి లేదా క్రమం తప్పకుండా ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలు తీసుకోవడం మంచిది.
- తప్పక వేసుకోవాల్సిన మందులు: వడదెబ్బ, డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే ఎలక్ట్రోలైట్స్ ని పౌడర్ లేదా సాల్ట్స్ రూపంలో తీసుకోవడం చాలా ముఖ్యం.
- వైద్యుడిని సంప్రదించాలి: ఒకవేళ వడదెబ్బ లేదా డీహైడ్రేషన్ కి గురైనప్పుడు పరిస్థితి తీవ్రంగా అనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
వేసవిలో వడదెబ్బ మరియు డీహైడ్రేషన్ నుండి రక్షణ కోసం.. ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువగా బయట తిరగకుండా ఉండటం మరియు సరైన మోతాదులో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
*ఒకవేళ మీకు వడదెబ్బ, డీహైడ్రేషన్ కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, ఎండల కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురైనా వెంటనే 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా వైద్య నిపుణుల సలహాలను పొందవచ్చు.