
వేసవిలో ఉద్యోగాలకు వెళ్తున్నారా..? మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి!
వేసవి కాలం అంటేనే ఎండలు, ఉక్కపోత, డీహైడ్రేషన్ లాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం బయటకు వెళ్లేవారికి ఈ ఎండల కాలంలో కొంచం కష్టంగా ఉంటుంది. ఆఫీసులకు వెళ్లడం, రోడ్లపై ప్రయాణించడం లేదా ఫీల్డ్ వర్క్ లాంటివి వేడి వాతావరణంలో చేయడం ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే, కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి హాని లేకుండా సౌకర్యవంతంగా ఉండవచ్చు. మరి ఈ మండు వేసవిలో ఉద్యోగాలకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
1. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటం
వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
అందుకే ఈ వేసవిలో డీహైడ్రేషన్ కి గురవ్వకుండా ఉండాలంటే..
- రోజూ కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలి
- ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి
- ఎక్కువగా నీరు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లస్సీ వంటి హైడ్రేషన్ డ్రింక్స్ తీసుకోవాలి
- కాఫీ, టీ లేదా కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి, ఎందుకంటే అవి శరీరంలో నీటిని తగ్గిస్తాయి.
2. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం
వేసవిలో వేడిని తట్టుకొని, మనకు సౌకర్యవంతంగా అనిపించే దుస్తులు ధరించడం చాలా ముఖ్యం.
- తేలికైన, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
- లేత రంగులు గల దుస్తులు ఎంచుకోవాలి – ఇవి సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తాయి.
- బూట్లకు(షూస్) బదులు గాలి ఆడే శాండిల్స్ లేదా చెప్పులు వాడండి.
- బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు లేదా స్కార్ఫ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.
3. అతినీలలోహిత కిరణాల (UV rays) నుండి రక్షణ
వేసవి కాలంలో అతినీలలోహిత కిరణాలు (UV rays) చర్మము మరియు కళ్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. వాటి నుండి రక్షణ పొందాలంటే..
- ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు
- సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్(SPF) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్‌ను చర్మానికి వాడాలి
- సన్ గ్లాసెస్ ధరించడం ద్వారా కళ్లను రక్షణ లభిస్తుంది.
- ఉదయం లేదా సాయంత్రం వేళలో బయట ప్రయాణాలు చేయడం మంచిది
4. ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవిలో మనం తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మండుటెండల్లో ఆహారం అధికంగా తీసుకోకుండా ఎక్కువగా పండ్లు, తేలికైన ఆహారం తీసుకుంటే మంచిది.
- తేలికైన ఆహారం అంటే.. తాజా పండ్లు, కూరగాయలు, సలాడ్స్ తీసుకోవాలి
- రోడ్డు పక్కన చిరుతిండి(స్నాక్స్) మానండి – ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి.
- పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను ఎక్కువగా తినాలి.
- మసాలా ఆహారాన్ని తగ్గించండి, ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.
5. ప్రయాణంలో జాగ్రత్తలు
ఉద్యోగం కోసం బయటకు వెళ్లేటప్పుడు ప్రయాణం కూడా సవాలుగా మారవచ్చు.
- బైక్‌లో వెళ్తున్నా, నడుస్తూ వెళ్తున్నా ఎండ నుండి రక్షణ కల్పించుకోవాలి.
- వాహనంలో వెళ్లేవారు AC ఉపయోగించండి లేదా కిటికీలు తెరిచి గాలి ఆడేలా చూసుకోవాలి.
6. ఆరోగ్య సమస్యలను గుర్తించడం
వేసవిలో ఉద్యోగాలకు వెళ్లేవారికి ప్రయాణంలో వడదెబ్బ(హీట్ స్ట్రోక్), హీట్ ఎగ్జాస్ట్ సమస్యలు రావచ్చు.
వాటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త తీసుకోవాలి..
- తలనొప్పి, తలతిరగడం, చెమట ఆగిపోవడం లాంటివి వడదెబ్బకి సంకేతాలు
- బలహీనత, వికారం లేదా చర్మం ఎర్రబడితే నీడలోకి వెళ్లి వెంటనే నీళ్లు తాగాలి
- సమస్య తీవ్రంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవి కాలంలో ఉద్యోగాలకు వెళ్లడం తప్పనిసరి అయినట్లయితే.. పైన చర్చించుకున్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించుకున్నవారు అవుతారు. అలాగే ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, తేలికైన దుస్తులు ధరించడం, సూర్య కిరణాల నుండి రక్షణ కల్పించుకొని, తేలికైన ఆహారం అలవాటు చేసుకుంటే.. మండుటెండల్లో కూడా మీ రోజువారీ జీవితం సులభంగా సాగుతుంది.
ఈ వేసవి ఎండల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. ఆనందంగా ఉండండి!
*మీకు ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య ఏర్పడినా.. 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను సంప్రదించండి..