
పని చేయకపోయినా.. శరీరం అలసిపోయినట్లు, రోజంతా నీరసంగా అనిపిస్తుందా?
ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక సవాలుగా మారింది. ఆధునిక జీవనశైలికి తోడు ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా ఆహారంలో విటమిన్లు కూడా తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విటమిన్ల లోపం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే.. మన ఆరోగ్యం విషయంలో విటమిన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అసలు విటమిన్ల లోపం ఏర్పడితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఏంటి? అనేవి ఇప్పుడు చూద్దాం!
మన శరీరంలో విటమిన్లు లోపించాయని గుర్తించడం ఎలా?
మన శరీరానికి విటమిన్ బి12 అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది అన్ని అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది.
సాధారణంగా శరీరంలో విటమిన్ b12 లోపిస్తే.. రోజంతా అలసటగా అనిపిస్తుంది. ఎలాంటి పనులు చేయకపోయినా త్వరగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. అదీగాక రోజంతా నీరసంగాను ఉందంటే.. అది తప్పకుండా విటమిన్ బి12 లోపించిన ప్రభావమే అని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్స్ లోపం అనేది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీనికి తోడు జ్ఞాపకశక్తి మెల్లగా తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాత్రుళ్ళు అలసిపోయిన ఫీలింగ్, ఎక్కువగా చెమటలు పట్టడం కూడా విటమిన్ b12 లోపించిన లక్షణాలలో ఒకటని అంటున్నారు. అంతేగాక విటమిన్స్ ప్రభావం కండరాలపై కూడా ఉంటుంది. విటమిన్స్ లోపిస్తే గనుక కండరాల పనితీరును బలహీన పరుస్తాయి. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
శరీరంలో విటమిన్ బి12 అనేది సహజంగా ఉత్పత్తి కాలేదు. అందువల్ల మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే శరీరానికి విటమిన్ బి12 అందుతుంది. విటమిన్స్ అనేవి ఎక్కువగా పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్ల నుండి లభిస్తాయి. ఒకవేళ శాకాహారులు అయితే విటమిన్ బి12 ని సప్లిమెంట్లు ద్వారా లేదా పోషకాహారాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. విటమిన్ బి12 అనేది కాలేయంలో నిల్వ ఉంటుందట. ఒకవేళ కాలేయంలో నిల్వ తగ్గినా.. విటమిన్స్ లోపం ఏర్పడుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.