శీతాకాలం ఆరోగ్య సంరక్షణకు 10 చిట్కాలు
చలికాలం వచ్చిందంటే చాలు.. ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నిటికీ రెక్కలు వచ్చేస్తాయి. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అమరేంద్ర బాహుబలి వచ్చాడు అన్నట్లుగా… చలికాలం వ్యాధులు కూడా మూకుమ్మడిగా శరీరంపై దాడి చేసేందుకు సిద్ధమవుతుంటాయి. ముఖ్యంగా జలుబు, గొంతు పట్టేయడం, శ్వాసకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. మరి శీతాకాలం ఇలాంటి అనారోగ్య సమస్యలు మనల్ని దరిచేరకుండా ఉండాలంటే కొన్ని తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి.
అదే విధంగా ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఉన్ని దుస్తులు ధరించడం, పొగ మంచు సమయంలో జాగ్రత్తగా ఉండటం అలవరచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చలి గాలులు వీచేటప్పుడు, పొగమంచు కురిసే వేళల్లో బయటికి వెళ్లకుండా ఉండాలి. చలి తీవ్రతని బట్టి ఉన్ని దుస్తులతో శరీరాన్ని, ముఖ్యంగా ముక్కు, చెవులను కవర్ చేసుకోవాలి. చలి ప్రభావం కూడా ఎక్కువగా ముఖం, పెదాలు, పాదాలపై ఉంటుంది.
ఈ విధంగా చలికాలంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడాలి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం!
తరచూ చర్మం పొడిబారడం:
చలికాలంలో చర్మ సంరక్షణ ఎంతో అవసరం. చర్మం జిడ్డు, తేమగా ఉండేవారికంటే పొడి చర్మం గల వారికే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. చర్మం పొడి బారడం మొదలైందంటే.. పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసం పొడి చర్మం గలవారు రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొంచం కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకొని స్నానం చేస్తే మంచిది.
చర్మంపై సబ్బుల ప్రభావం:
చలికాలంలో రెగ్యులర్ గా వాడే సబ్బుల కంటే గ్లిజరిన్ సబ్బులు వాడటం మంచిదని నిపుణులు సలహా.
మాయిశ్చరైజర్లు:
చలికాలంలో ముఖం అందంగా, కాంతివంతంగా మెరవాలంటే.. విటమిన్-E కలిగిన మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు, చేతులకు వేజలైన్ లేదా కొబ్బరి నూనె రాసుకొని, పాదాలకు సాక్సులు ధరించాలి. అలాగే వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది.
వ్యాయామం చేయాలి:
చలికాలంలో నిద్ర లేవడానికి బద్ధకంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్ర లేచాక కండరాలు పట్టేసినట్లు ఉంటుంది. అలా కాకుండా ఎల్లప్పుడూ హుషారుగా ఉండాలంటే వ్యాయామం, యోగ, వాకింగ్ లాంటివి చేస్తే మంచిదని అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఒంట్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది.
నీళ్లు ఎక్కువగా తాగాలి:
చలికాలంలో పదేపదే మూత్రం వస్తోందని నీరు తాగడం ఆపేస్తుంటారు. అలా చేయడం మీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. నీరు తక్కువ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి చర్మం పొడిబారడం మొదలవుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి కాలం ఏదైనా నీరు తాగడం మాత్రం తగ్గించవద్దు.
వెల్లులి చేసే మేలు:
చలికాలంలో సాధారణంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమయాలలో వ్యాధుల బారిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకూడదు అంటే.. మీరు తినే ఆహారంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఎక్కువగా తీసుకోండి. అలాగే వెల్లుల్లి కూడా చాలా హెల్ప్ చేస్తుంది.
తీసుకునే ఆహారం:
చలికాలంలో ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది. వేడి వేడి ఆహారం తీసుకుంటూ శీతల పానీయాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం. ముఖ్యంగా జంక్ ఫుడ్ ని బాగా ఇష్టపడుతుంటారు. అలాంటివారు జంక్ ఫుడ్ వల్ల మధుమేహం, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ కి పిల్లలను దూరంగా ఉంచాలి.
పరిశుభ్రత తప్పనిసరి:
చలికాలం ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
సరైన నిద్ర:
ఏ కాలంలోనైనా మనిషికి సరైన నిద్ర అనేది చాలా అవసరం. వయసును బట్టి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా సరైన నిద్ర శరీరంలో టాక్సిన్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి.. చలికాలంలో నిద్రకు కూడా ప్రాధాన్యత తప్పనిసరి అని విశ్లేషకులు చెబుతున్నారు.
టీ – కాఫీలు తగ్గించాలి:
వాతావరణం చల్లగా ఉందంటే.. చాలామంది ఎక్కువగా కాఫీ, టీలు తాగుతుంటారు. వాటి వల్ల శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగి డీ హైడ్రేషన్, నిద్ర లేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.