వేసవి ఎండల్లో పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వేసవి కాలం వచ్చిందంటే మండుటెండలు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. సాధారణంగా వేసవి ఎండలను పెద్దలు తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆటలు ఆడుకుంటూ, అల్లరి చేసే పిల్లలు నీడలో తప్ప ఎండలో అసలు తట్టుకోలేరు. ఫలితంగా డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తప్పక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఎండాకాలం పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా అనేది చూద్దాం!
1. డీహైడ్రేషన్ నివారించడం:
వేసవిలో పిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు. దీంతో చెమట పట్టడం వల్ల వారి శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుంది. అయితే, డీహైడ్రేషన్ ని నివారించాలంటే..
- పిల్లలకు తరచూ నీళ్లు తాగాలని సూచించాలి
- కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ లాంటి సహజమైన పానీయాలు ఇవ్వాలి.
- ఎక్కువగా చల్లని నీరు అందుబాటులో ఉంచాలి
- శీతల పానీయాలు(కూల్ డ్రింక్స్), ఐస్ క్రీమ్స్ ఎక్కువగా ఇవ్వకూడదు. లేదంటే గొంతు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
2. వేడి నుండి రక్షణ:
మధ్యాహ్న సమయంలో ఎండ వేడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో బయటికి వెళ్తే.. పిల్లల చర్మం, కళ్లు త్వరగా దెబ్బతింటాయి. కాబట్టి..
- ఎండలో ఎక్కువ ఆటలు ఆడనివ్వకూడదు. (ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య)
- SPF 30+ సన్‌స్క్రీన్‌ను పిల్లల చర్మానికి రాస్తే మంచిది (పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి, చర్మానికి సరైనది ఎంచుకోవాలి).
- బయటికి వెళ్తే టోపీ, గొడుగు లేదా క్యాప్ వాడేలా చూడాలి.
3. దుస్తుల ఎంపిక:
వేసవిలో తక్కువ వేడిని కలిగించే దుస్తులు పిల్లలకు సౌకర్యాన్ని ఇస్తాయి. కాబట్టి దుస్తుల విషయంలో ఎంపిక తప్పనిసరి.
- తేలికైన, వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేయాలి.
- లేత రంగులు (తెలుపు, పసుపు) ఎంచుకోండి, ఇవి ఎండను తక్కువగా గ్రహిస్తాయి.
- చెమట పట్టిన బట్టలను వెంటనే మార్చండి, లేకపోతే చర్మ సమస్యలు (రాషెస్) వస్తాయి.
4. ఎలాంటి ఆహారం అందించాలి:
వేసవిలో పిల్లల శరీరానికి పోషకాలతో కూడిన శరీరంలో వేడిని తగ్గించే (చలువ చేసే) ఆహారాన్ని అందించాలి.
- పుచ్చకాయ, ద్రాక్ష, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు ఇవ్వాలి
- తాజా కూరగాయలు, సూప్ లు, ఉడకబెట్టిన ఆహారం ఇవ్వాలి.
- జంక్ ఫుడ్, ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వకూడదు.
- రోజులో ఆహారం ఒకేసారి ఎక్కువ పెట్టకుండా, ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఇవ్వండి.
5. ఇంటి వాతావరణాన్ని చల్లగా ఉంచాలి:
పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతారు కాబట్టి.. ఇంటి వాతావరణం సౌకర్యవంతంగా ఉంచాలి.
- గదుల్లో ఫ్యాన్, కూలర్ లేదా AC వాడండి
- కిటికీలకు మందపాటి కర్టెన్లు వేసి ఎండ వేడిమి లోపలి రాకుండా చూసుకోవాలి
- పిల్లలు నిద్రపోయేటప్పుడు తేలికైన పరుపు, దిండు వాడండి.
6. ఆరోగ్య సమస్యలను గుర్తించాలి:
మండుటెండల్లో పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోండి.
- వడదెబ్బ (హీట్ స్ట్రోక్): జ్వరం, తలతిరగడం, చెమట ఆగిపోతే చల్లని నీటితో శరీరాన్ని తుడవండి. వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.
- డీహైడ్రేషన్: నోరు ఎండిపోవడం, మూత్రం తక్కువ రావడం కనిపిస్తే నీళ్లు, ORS (Oral Rehydration Solution) అందించండి.
- చర్మ సమస్యలు: రాషెస్, దురదలు వస్తే చల్లని నీళ్లతో కడగండి, డాక్టర్ సలహా తీసుకోండి.
7. ఆటలు, పనులలో జాగ్రత్తగా చూసుకోవాలి:
పిల్లలు ఆడుకోవడం సహజం, కానీ వేసవిలో దీన్ని కాస్త నియంత్రించాలి. లేదంటే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
- ఉదయం తొందరగా లేదా సాయంత్రం ఆలస్యంగా బయట ఆటలకు పంపించవచ్చు.
- ఇంట్లోనే ఆటలు, పుస్తకాలు చదవడం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
- శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఆటలను ప్రోత్సహించకూడదు.
వేసవి కాలంలో మండుటెండల నుండి పిల్లలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ కి గురవ్వకుండా.. తేలికపాటి దుస్తులు వేసి.. ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడిపేలా చూడాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట ఆటలకు ప్రోత్సహించాలి. కాకపోతే, పిల్లలు ఏ పని చేస్తున్నా.. ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి ఆరోగ్య రక్షణ చూసుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, డాక్టర్ సలహాలు తీసుకుంటే పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా వేసవిని సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు.
మరి ఈ వేసవిలో మీ ఆరోగ్యానికి, పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఏర్పడినా.. 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణుల సలహాలు పొందవచ్చు!