
జీవనశైలి మార్పుతోనే కాలేయం సురక్షితం – డా. ఎన్. సుధీర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
వరల్డ్ లివర్ డే సందర్భంగా(ఏప్రిల్ 19) ఈరోజు కిమ్స్ మరియు మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ గ్రూప్ మరియు స్థానిక వాకర్స్ క్లబ్ సంయుక్తంగా కిమ్స్ హాస్పిటల్ నుండి అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేయ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ముఖ్య లక్ష్యమని మెడికల్ డైరెక్టర్ డా. హరి కిరణ్ వర్మ తెలిపారు.
అనంతరం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. ఎన్. సుధీర్ మరియు మెడికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. కే.పి.ఆర్. కిషోర్ ల ఆధ్వర్యంలో కాలేయ ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శరీర భాగాలలో కాలేయం యొక్క ప్రాముఖ్యత, దాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్ధాలను గురించి డా.సుధీర్ వివరించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘కేవలం మద్యపానం వల్ల మాత్రమే కాలేయం పాడవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ సరైన ఆహార నియమాలు పాటించక పోవడం వల్ల కూడా కాలేయం పాడవుతుందని తెలిపారు. హెపటైటిస్-బి కి వాక్సిన్ ఉందని, హెపటైటిస్-సి కి చికిత్స ద్వారా 90 రోజులలో నయం చేయగలమని తెలిపారు. ఈ రెండు వ్యాధులూ రక్తం లేదా శరీర ద్రవాల ద్వారా సంక్రమిస్తాయని తెలిపారు. కనీసం వారానికి 90 నిముషాల శారీరక వ్యాయామంతో పాటు ప్రోటీన్స్, పీచు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకుంటే కాలేయాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. కొన్ని రకాల హెపటైటిస్ వ్యాధులు కలుషిత నీరు, ఆహారం వల్ల రావచ్చని, చాలామంది అవగాహన లోపం వల్లే ఈ వ్యాధులకు గురవుతున్నారని తెలియజేశారు.
తదుపరి ఐఎంఏ మరియు వాకర్స్ క్లబ్ ప్రతినిధి డా. పి.ఎస్. శర్మ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ “ఆహారమే ఔషధం” అనే నినాదంతో కాలేయ దినోత్సవానికి పిలుపునిచ్చిందని అన్నారు. ఆ తర్వాత అందరితో “కాలేయ ఆరోగ్య ప్రతిజ్ఞ” చేయించారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ డీన్ డా. ఆనంద్ ఆచార్య, మెడికల్ సూపరింటెండెంట్ డా. పి. సుబ్బారావు, కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మోహన రాజు, సిఏఓ శ్రీ రఘు, కిమ్స్ జనరల్ మేనేజర్లు రాధా మనోహర్, కె.కె.శర్మ, సురేష్, నరేష్, కిషోర్, కిమ్స్ మరియు మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ సిబ్బంది, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ సత్య వరప్రసాద్, మహిళా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి అనంతలక్ష్మి మరియు ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఇటీవల కోనసీమలో పెరుగుతున్న లివర్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, వరల్డ్ లివర్ డే సందర్భంగా మెడ్ యునైటెడ్ హాస్పిటల్ వారు వినూత్న అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు. ఏప్రిల్ 19 మరియు 26వ తేదీలలో లివర్ కి సంబంధించి ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్స్ తో పాటు కేవలం రూ. 299/- లకే లివర్ సంబంధించి హెపటైటిస్ మరియు లివర్ ఫంక్షన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మెడ్ యునైటెడ్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ శ్రీ శివ కుమార్ తెలిపారు. ఇటువంటి అవగాహనా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి దోహదం చేస్తున్న సిబ్బందిని కిమ్స్ చైర్మన్ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ రాజు గారు, ఎం.డి. రవి కిరణ్ వర్మ గారు ప్రశంసించారు.